Wednesday, 13 July 2016

Telicom industry in India

నైపుణ్యం ఉంటే అవ‌కాశం సొంత‌మైన‌ట్టే


భార‌త్‌లో 98 కోట్ల మంది చేతుల్లో సెల్‌ఫోన్ రింగ‌వుతోంది. 70 కోట్ల మంది ఇంట‌ర్నెట్ సేవ‌లు ఉప‌యోగించుకుంటార‌ని మైక్రోసాఫ్ట్ నివేదించింది. ప‌ట్టణాల్లో ప్రతి వంద మంది ద‌గ్గర 136 సెల్‌ఫోన్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్రపంచ టెలికాం మార్కెట్‌లో రెండో స్థానం మ‌న‌దే. ఈ గ‌ణాంకాలు చాలు టెలికాం సెక్టార్ దేశంలో ఎలా విస్తరిస్తుందో చెప్పడానికి. హెల్త్‌కేర్‌, అగ్రిక‌ల్చర్‌, డిఫెన్స్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, మీడియా... ఏ రంగాన్ని తీసుకున్నా అందులో టెలికాం సేవ‌లే ప్రధాన‌పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేసిన ఘ‌న‌త టెలికాం సెక్టార్‌దే. ఊరిలోని బామ్మగారు వెనెజులాలోని మ‌న‌వ‌డితో గ‌ళ‌గ‌ళా మాట్లాడ‌డం వెనుక ఉన్నది టెలికాం రంగ‌మే. స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ వినియోగించేవాళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. భ‌విష్యత్తులో ఈ వేగం మ‌రింతగా విస్తరించ‌నుంది. దీంతోపాటే కొత్త ఉద్యోగ అవ‌కాశాలూ సొంతం కానున్నాయి.

1980లో టెలిపోన్ ఓ విలాస ‌వ‌స్తువు. ధ‌నికుల‌కే ప‌రిమిత‌మైన ప‌రిక‌రం. కానీ నేడు దేశంలో 98 కోట్ల మంది సెల్‌ఫోన్ య‌జ‌మానులు ఉన్నారు. ప్రపంచ టెలిక‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్ లో భార‌త్ 2వ స్థానానికి చేరుకుంది. 2013 సెప్టెంబ‌రు నాటికే మార్కెట్ ప‌రిమాణం రూ.57,400 కోట్లకు చేరింది. టెలికాం సేవ‌లు అందించేవాళ్లు, టెలికాం రంగానికి కావాల్సిన ప‌రిక‌రాలు రూపొందించేవాళ్లు, సెల్‌ఫోన్లు త‌యారుచేసే కంపెనీలు, టెలికాం నెట్‌వ‌ర్క్‌, ఐటీ మేనేజ్‌మెంట్‌, రిటైల్ ఇవ‌న్నీ టెలికాం సెక్టార్‌లో భాగ‌మే.

ప్రస్తుత టెలికాం రంగంలో వైర్‌, వైర్‌లెస్ టెక్నాల‌జీలు కీల‌క పాత్ర వ‌హిస్తున్నాయి. అయితే ఇప్పుడు వైర్‌లెస్ టెక్నాల‌జీ శ‌ర‌వేగంగా విస్తరిస్తోంది. టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ మార్కెట్‌లో ఎయిర్‌టెల్ 22 శాతం, రిల‌యెన్స్ 13, వొడాఫోన్ 18, ఐడియా 15, బీఎస్ఎన్ఎల్ 11, టాటా 7, ఎయిర్‌సెల్ 7 శాతం, మిగిలిన వాటా చిన్నాచిత‌కా కంపెనీలు క‌లిగిఉన్నాయి. టెలికాం రంగంలో సేవ‌లందించే ఈ కంపెనీల‌న్నీ ట‌వ‌ర్ల ఏర్పాటు, త‌దిత‌రాల కోసం ఈ రంగానికి చెందినమౌలిక సౌక‌ర్యాలు క‌ల్పించే కంపెనీల‌పై ఆధార‌ప‌డుతున్నాయి. ఇండ‌స్‌, జీటీఎల్ మొద‌లైన కంపెనీలు ఈ త‌ర‌హా సేవ‌లు అందిస్తున్నాయి. టెలికాం సెక్టార్‌లో నెట్‌వ‌ర్క్‌, ఐటీ విష‌యానికొచ్చేస‌రికి టెక్ మ‌హీంద్రా, టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్, విస్రో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్‌...త‌దిత‌ర కంపెనీలు ప్రత్యేక సేవ‌లు అందిస్తున్నాయి. టెలికాం ప‌రిక‌రాల రూప‌క‌ల్పన‌లో విదేశీ కంపెనీల‌దే అగ్రస్థానం. ఎరిక్‌స‌న్‌, నోకియా సీమెన్స్ నెట్‌వ‌ర్క్‌, జెడ్‌టీఈ కార్పొరేష‌న్, హువాయ్‌, ఆల్కాటెల్‌, శ్యామ్‌సంగ్ త‌దిత‌ర కంపెనీలు టెలికాం రంగానికి ఉప‌యోగ‌ప‌డే ప‌రిక‌రాల‌ను రూపొందిస్తున్నాయి. హ్యాండ్‌సెట్ల త‌యారీలో శ్యామ్‌సంగ్‌, మైక్రోసాఫ్ట్ (నోకియా), మైక్రోమ్యాక్స్‌ల‌తోపాటు ప‌లు దేశీయ, చైనా కంపెనీల వాటా అధికంగా ఉంది. ప్రస్తుతం హ్యాండ్‌సెట్ల మార్కెట్‌లో చిన్న బ్రాండ్‌లదే పైచేయి. 2014 సెల్‌ఫోన్ మార్కెట్‌లో 43 శాతం బ్రాండెడ్ కంపెనీల‌ది కాగా మిగిలిన 57 శాతం చిన్నాచిత‌కా సంస్థల‌దే. కొత్తగా మొబైల్ దుకాణాలు తెరుస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌...త‌దిత‌ర ఈ కామ‌ర్స్ కంపెనీల‌న్నీ ఎక్కువ‌గా సెల్‌ఫోన్లను విక్రయిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ టెలికాం రంగంలో ఉద్యోగాలు విస్తరించేలా చేస్తున్నాయి.

40 లక్షల కొత్త ఉద్యోగాలు...

వ‌చ్చే అయిదేళ్లలో భార‌త టెలికాం విభాగంలో ప్రత్యక్ష, ప‌రోక్షంగా 40 ల‌క్షల ఉద్యోగాలు ల‌భిస్తాయని ర్యాండ్‌స్టాడ్ ఇండియా అంచ‌నా వేసింది. ప్రభుత్వం గ్రామాల‌కు టెలికాం ద్వారా ఐటీ సేవ‌లు విస్తరించ‌డం, స్మార్ట్ ఫోన్లు, ఇంట‌ర్నెట్ వినియోగం పెర‌గ‌డం...ఈ ప‌రిణామాలతో ఉద్యోగావ‌కాశాలు విస్తరించ‌నున్నాయి. దీంతో 2013లో 20 లక్షల 80 వేల మంది ఉద్యోగుల‌తో ఉన్న టెలికాం సెక్టార్ 2022 నాటికి 41 ల‌క్షల 60 వేల మందితో బ‌ల‌మైన శ‌క్తిగా ఆవిర్భవించ‌నుంది. 2017 నాటికి ప‌రిస్థితులు అంత గొప్పగా ఉండ‌క‌పోయిన‌ప్పటికీ అనంత‌రం వేగంగా పుంజుకోవ‌డం వ‌ల్ల ఈ స్థాయికి చేరుకోవ‌డం సాధ్యమేన‌ని స‌ర్వే అంచ‌నావేసింది. ఈ ఉద్యోగాలు రిటైల్ హ్యాండ్‌సెట్ల త‌యారీ కంపెనీలు, టెలికాం సేవ‌లు అందించే సంస్థలు, సెల్‌ఫోన్లు, సంబంధిత ప‌రిక‌రాలు రిటైల్‌గా విక్రయించే దుకాణాలు, పంపిణీ వ్యవ‌స్థ, టెలికాం రంగానికి ఐటీ సేవ‌లు అందించే కంపెనీలు...త‌దిత‌ర చోట్ల ఉంటాయి. ఈ అవ‌కాశాల‌న్నీ ప‌ట్టభ‌ద్రులు, ఉన్నత చ‌దువులు చ‌దివిన‌వారికి ద‌క్కుతాయి. కొత్తగా వ‌చ్చే ఉద్యోగాల్లో 70 శాతం వీరే చేజెక్కించుకుంటారు. కొన్ని ఉద్యోగాలు మాత్రం సాంకేతిక కోర్సులు చ‌దివిన‌వారికి సొంత‌మ‌వుతాయి. టెలికాం ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన‌వాళ్లు టెక్నిక‌ల్ పోస్టుల్లో రాణించ‌వ‌చ్చు. మ‌రికొన్ని ఉద్యోగాలు మాత్రం ఈ రంగంలో ప‌ని అనుభ‌వం ఉన్నవారికి చెందుతాయి. అప్పుడే కాలేజీ నుంచి బ‌య‌టికి వ‌చ్చినవారికి ప‌రిమితంగానే అవ‌కాశాలు ఉన్నప్పటికీ ప్రత్యేక శిక్షణ ద్వారా ఉద్యోగాలు దొర‌బుచ్చుకోవ‌చ్చు. ఉద్యోగ క‌ల్పన‌లో టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కీల‌క పాత్ర వ‌హిస్తోంది. ఆయా జాబ్‌లు, వాటికి కావాల్సిన అర్హత‌లు, శిక్షణ‌, స‌ర్టిఫికేష‌న్లు ఈ కౌన్సిల్ అందిస్తోంది. ఫ్రెష‌ర్లు ఈ కౌన్సిల్ ద్వారా ఉద్యోగులుగా అవ‌తరించ‌వ‌చ్చు. ఇందులో కోర్సుల‌కు న‌మోదుచేసుకుని, స‌ర్టిఫికేష‌న్లు పూర్తిచేసుకుంటే భ‌విష్యత్తులో వ‌చ్చే ఉద్యోగాల‌ను సొంతం చేసుకోవ‌డం సులువ‌వుతుంది.


2022 నాటికి టెలికాం విభాగాల‌వారీ ఉద్యోగాలిలా...

టెలికాం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు -12 లక్షలు
టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ‌ర్లు - ల‌క్షా ముప్పై వేలు
టెలికాం ప‌రిక‌రాల త‌యారీ కంపెనీలు- 6 ల‌క్షల 40 వేలు
టెలికాం నెట్‌వ‌ర్క్ అండ్ ఐటీ- 7 ల‌క్షల 70 వేలు
హ్యాండ్‌సెట్లు, టెలికాం రిటైల్‌- 14 ల‌క్షల 40 వేలు

No comments :

Post a Comment

Recent Posts