అదేదో ఊరినుండి మహా శిల్పి వచ్చాడు. మరేదో ఊరినుండి పెద్ద బండ తెచ్చాడు.
ఆరడుగులు కొలత పెట్టి బండను కండించాడు. మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేసాడు.
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది. మూడడుగుల ముక్క బండ చాకి రేవు చేరింది.
కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి. కంపు కొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి.
గొంతెమ్మ గొంతు కోర్కెలన్నీ తీర్థం తో తడిచాయి. మురికి మరక బట్టలన్నీ నీళ్ళల్లో మురిగాయి.
అర్ధం గాని స్టోస్త్రాలతో పూజారి భక్తి శ్రద్ధలు. చాకలి నోటి వెంట ఐస్ .. ఐస్ .. శబ్దాలు.
శఠగోపం పవిత్రంగా ప్రతీ తలను తాకుతోంది. పవిత్రతకై ప్రతి బట్ట బండను బాదుతోంది.
కడకు, గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి. రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి.
గుడిలోని దేవుడా రేవు లోని బండా !! ఎవరు దేవుడు ఎవరు బండ !!
- రంగనాథ్
No comments :
Post a Comment